ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి అక్కడే ప్రాణాలు కోల్పోతున్న భారత విద్యార్థుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తాజాగా తెలంగాణకు చెందిన యువకుడు అమెరికాలో కాల్పులు జరగడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. రంగారెడ్డి జిల్లా కేశంపేట గ్రామానికి చెందిన గంప ప్రవీణ్ అనే 27 ఏళ్ల యువకుడు అమెరికాలో మృతి చెందాడు. అక్కడ గంప ప్రవీణ్ ఎంఎస్ రెండో సంవత్సరం చదువుతుండగా.. తాజాగా జరిగిన కాల్పుల్లో దుర్మరణం పాలయ్యాడు. ఆ విషయం తెలిసి అతడి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పార్ట్ టైం జాబ్‌కు వెళ్లి వస్తుండగా.. ఆ కాల్పుల్లో గంప ప్రవీణ్ మరణించినట్లు తెలుస్తోంది.