ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుక్రవారం విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలలో పర్యటించారు. గిరిజన ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. విపక్షంలో ఉన్న సమయంలో ఈ ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ పర్యటించారు. ఈ సందర్భంగా తమ ప్రాంతాల్లో రోడ్లు సరిగా లేవంటూ, డోలీ మోతలు తప్పడం లేదంటూ పలువురు మహిళలు తమ సమస్యలను పవన్ కళ్యాణ్ దృష్టికి తెచ్చారు. ఈ నేపథ్యంలో అధికారంలోకి రాగానే వీరి సమస్యలపై దృష్టిపెట్టిన డిప్యూటీ సీఎం.. 9 గ్రామాల్లో సుమారు 50 కోట్లతో రహదారుల నిర్మాణానికి శుక్రవారం శంకుస్థాపన చేశారు.