వరంగల్ సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రిలో దసరా నాటికి ఓపీ సేవలు ప్రారంభించేందుకు అధికారులు నిర్మాణ పనులను వేగవంతం చేస్తున్నారు. సీఎంవో పర్యవేక్షణలో జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటై రోజువారీగా పనులను సమీక్షిస్తోంది. 24 అంతస్తుల్లో నిర్మిస్తున్న ఈ ఆస్పత్రిలో తొలుత ఓపీ సేవలు ప్రారంభించి, అనంతరం వైద్య విభాగాలను దశలవారీగా అందుబాటులోకి తేవాలని యోచిస్తున్నారు. కొత్త ఆస్పత్రి అందుబాటులోకి వస్తే ఎంజీఎం ఆస్పత్రిపై ఒత్తిడి తగ్గి, ఉత్తర తెలంగాణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు లభించే అవకాశం ఉంది.