ఎన్టీఆర్‌కు భారతరత్న ఇస్తే అది ఆయన ఒక్కరికే కాదు.. దేశానికి, తెలుగు జాతి మొత్తానికీ గౌరవం అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇది తెలుగు వారందరి ఆకాంక్ష.. ఆయనకు భారతరత్న సాధించే వరకూ వదిలిపెట్టమన్నారు. దేశం గర్వించే విధంగా తెలుగుజాతి ఎదగడమే ఎన్టీఆర్‌కు ఘనమైన నివాళి అన్నారు. నందమూరి తారక రామారావు సినీ వజ్రోత్సవాన్ని విజయవాడ శివారులోని పోరంకిలో ఉన్న మురళీ రిసార్ట్స్‌లో నిర్వహించగా.. చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలుగు జాతి పేరు వింటేనే గుర్తొచ్చే తొలి పేరు ఎన్టీఆరేనన్నారు. తెలుగు జాతి ఆత్మగౌరవం ఎన్టీఆర్.. తెలుగువారి గుండెల్లో ఆయన ఎప్పటికీ కొలువై ఉంటారన్నారు. రైతు కుటుంబంలో పుట్టి తెలుగు సినీ చరిత్రలో శిఖరాగ్రానికి ఎదిగిన ఘనత ఆయనదని.. పార్టీ పెట్టి తొమ్మిది నెలల్లో ముఖ్యమంత్రి అయిన ఘనత ఆయనకే సొంతమన్నారు. ఆయనలా వెండితెరను, రాజకీయాలను ఏలిన ఏకైక నాయకుడు దేశ చరిత్రలో మరొకరు లేరన్నారు. రంగం ఏదైనా ఎన్టీఆర్ అడుగుపెట్టిన ప్రతిచోటా సువర్ణాధ్యాయమే అన్నారు.