AP Governor Abdul Nazeer Health Update: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్ అస్వస్థతకు గురయ్యారు. కడుపులో తీవ్ర నొప్పి రావడంతో ఆయనను విజయవాడలోని మణిపాల్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. సమాచారం ప్రకారం, గవర్నర్ అబ్దుల్ నజీర్.. బెంగళూరు నుంచి విజయవాడకు రావాల్సి ఉండగా, ఆయన ప్రయాణిస్తున్న విమానం ఆలస్యమైంది. రాత్రి 12 గంటలకు చేరుకోవాల్సిన విమానం ఆలస్యంగా అర్ధరాత్రి 2 గంటల సమయంలో విజయవాడకు చేరుకుంది. అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో తెల్లవారుఝామున సుమారు 4:30 గంటలకు గవర్నర్‌కు కడుపులో నొప్పి ప్రారంభమైంది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఆయనను ఆస్పత్రికి తరలించారు. వైద్యుల పర్యవేక్షణలో గవర్నర్ ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. అధికారులు పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నారు. అయితే, వైద్య పరీక్షల అనంతరం మాణిపాల్ ఆసుపత్రి నుంచి తన నివాసానికి చేరుకున్నారు గవర్నర్ అబ్దుల్ నజీర్.. జర్నీ ప్రభావం, అర్ధరాత్రి ఆలస్యం కావడం లాంటి చిన్న కారణాల వలన అస్వస్థతకు గురైనట్టుగా తెలుస్తోంది..