ఏపీ ట్రాఫిక్ ఈ-చలాన్ల కేసులో భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, డిజియాత్ర యాప్ రూపొందించిన డేటా ఎవాల్వ్ సంస్థల మధ్య జరుగుతున్న ఆర్బిట్రేషన్ ఆదేశాలపై స్టే విధించింది. ఈ- చలాన్ల సాఫ్ట్‌వేర్ సరఫరా, నిర్వహణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, డేటా ఎవాల్వ్ సంస్థల మధ్య గతంలో ఒప్పందం జరిగింది. 2018 నుంచి 2021 మధ్య కాలానికి ఒప్పందం చేసుకున్నారు. అయితే ఒప్పందం పూర్తైన తర్వాత కూడా, ఈ కాంట్రాక్టును అడ్డుపెట్టుకుని అక్రమంగా చలాన్లు వసూలు చేశారని.. ఈ రకంగా రూ.37 కోట్లు నిధులు సొంత అకౌంట్లకు మళ్లించారని డేటా ఎవాల్వ్ సంస్థపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. దీంతో డేటా ఎవాల్వ్ సంస్థకు నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు.. విచారణను మే 25కు వాయిదా వేసింది.