ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత.. హాస్టళ్లలో పరిస్థితులను తెలుసుకునేందుకు ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. ఇందులో భాగంగా.. అనకాపల్లిలోని పాయకరావుపేట బీసీ బాలికల కాలేజ్ హాస్టల్‌ను తనిఖీ చేశారు. అయితే.. ఆకస్మికంగా తనిఖీ చేసి అక్కడి వార్డెన్‌ను, సిబ్బందిని షాక్‌కు గురిచేయాలనుకున్న హోంమంత్రికి ఊహించని అనుభవం ఎదురైంది. హోంమంత్రి వెళ్లిన సమయంలో హాస్టల్‌లో వార్డెన్ అందుబాటులో లేకపోవడంతో.. మంత్రి అనిత హాస్టల్ విద్యార్థులతో కూర్చొని మాట్లాడారు. నేలపైనే బాలికలతో కూర్చొని.. వాళ్లకున్న ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. ఫోన్‌లో అధికారులకు కోటింగ్ ఇచ్చిన మంత్రి.. పిల్లలతో కలిసి వాళ్లకు పెట్టే భోజనాన్ని తాను ఓ ప్లేట్‌లో పెట్టుకుని.. వాళ్లతో పాటే నేలపై కూర్చున్నారు. అయితే... ఈ క్రమంలో హాస్టల్ పిల్లలకు కూడా సన్నబియ్యం పెట్టాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిందని.. ఎందుకు పెట్టట్లేదని సిబ్బందిని ఇంకో రౌండ్ వేసుకున్నారు మంత్రి అనిత. అప్పుడే.. నోట్లో ముద్ద పెట్టుకుందామని కలుపుతుంటే.. ఊహించని అనుభవం ఎదురైంది. ప్లేట్‌లో వెంట్రుక కనిపించింది. అప్పటికే చాలా సీరీయస్ అయిన మంత్రి.. తన భోజనంలోనే వెంట్రుక కనిపించేసరికి.. ఎవరిని ఏమనాలో తెలియక నవ్వుకున్నారు. మంత్రిని చూసి.. పిల్లలంతా కూడా ఒక్కసారిగా గొల్లుమన్నారు. అయితే.. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావటంతో.. అది చూడటానికి బొద్దింకలా కనిపిస్తుండటంతో.. మంత్రి భోజనంలో బొద్దింక వచ్చిందంటూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ విషయం కాస్త.. హోంమంత్రి అనితకు చేరటంతో.. ఆమె క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.