ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ శైవ క్షేత్రాలు శివనామస్మరణతో మారుమోగిపోతున్నాయి. శ్రీకాళహస్తి, కోటప్పకొండ, పిఠాపురంతో పాటు అనేక ప్రాంతాల్లోని దేవాలయాల్లో భక్తులు ఉదయం నుంచే బారులు తీరారు. నరసరావుపేటలోని ప్రముఖ శైవక్షేత్రం కోటప్పకొండ త్రికోటేశ్వరుని తొలిపూజతో మహాశివరాత్రి వేడుకలు ప్రారంభమయ్యాయి. కొలను నుంచి బిందె తీర్ధం తీసుకొచ్చి కలశ పూజ నిర్వహించారు. బిందె తీర్ధంతో తికొటేశ్వరునికి అభిషేకం నిర్వహించారు. అనంతరం త్రికోటేశ్వరునికి ప్రత్యేక అలంకరణ జరిగింది. మహాకుంభ మేళాకు వెళ్లలేని వారు త్రికోటేశ్వరుని అభిషేకించిన తీర్ధం చల్లుకుంటే అంతటి పుణ్యఫలం వస్తుందని భక్తులు విశ్వసిస్తారు. దీంతో అభిషేకించిన నీళ్లు చల్లించుకోవటం కోసం భక్తులు ఎగబడ్డారు. తొలి పూజతో మహాశివరాత్రి వేడుకలు ప్రారంభం కావడంతో భక్తులను త్రికోటేశ్వరుని దర్శనం కోసం అనుమతిస్తున్నారు. తిరుపతిజిల్లాలోని ప్రముఖ వాయులింగక్షేత్రం శ్రీకాళహస్తి శివనామస్మరణలతో మారుమోగిపోతోంది. మహాశివరాత్రి పర్వదినం కావడంతో తెల్లవారుజామున 3గంటల నుంచే దర్శనానికి భక్తులు క్యూ కట్టారు. ఆలయ అధికారులు కూడా అందుకు తగిన ఏర్పాట్లు చేశారు. క్యూలైన్లలో భక్తజనం నిండిపోయింది.