ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు ప్రత్యేక రాజ్యాంగం ఉంటుందా, ఆయన ఎవరినైనా చంపినా పర్వాలేదా అని తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజను పరామర్శించిన కోమటిరెడ్డి.. మీడియాతో మాట్లాడారు. అల్లు అర్జున్ అరెస్ట్‌పై బీఆర్ఎస్ నేతలు దారుణంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. హరీష్ రావు, కేటీఆర్ ఐకాన్ స్టార్‌ను అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నిస్తున్నారని.. ఐకాన్ స్టార్‌కు ప్రత్యేక రాజ్యాంగం ఉంటుందా.. ఆయన ఎవరిని చంపినా పర్వాలేదా అని మండిపడ్డారు. ప్రధాని అయినా సర్పంచ్ అయినా ఐకాన్ స్టార్ అయినా అందరికీ ఒకటే చట్టం ఉంటుందని చెప్పారు. పోలీసులు 11 రోజులు విచారణ చేసి అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేశారని వెల్లడించారు. సినీ ప్రముఖులు జైలుకెళ్లొచ్చిన అల్లు అర్జున్‌ను పరామర్శించారు కానీ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న శ్రీతేజ్‌ను పరామర్శించేందుకు ఆస్పత్రికి మాత్రం రాలేదని ఫైర్ అయ్యారు.