జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన దారుణమైన ఉగ్రదాడిని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా ఖండించారు. ఈ దాడి ఉరి , పుల్వామా దాడుల కంటే అత్యంత ఘోరమైనదని.. ఇది తనను తీవ్రంగా కలచివేసిందని ఆయన అన్నారు. నిఘా వైఫల్యం కారణంగానే ఈ దాడి జరిగిందని ఆయన ఆరోపించారు. ఈ ఘటనకు కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ దాడి భద్రతా వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతోందని, ప్రభుత్వం మరింత అప్రమత్తంగా ఉండాలని ఒవైసీ అన్నారు. పర్యాటకుల భద్రతకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఉగ్రవాదంపై పోరాటంలో ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని వెళ్లాలని ఆయన సూచించారు.