Kadapa Fly Ash: తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వర్గాల నడుమ బూడిద (ఫ్లైయాష్) వివాదం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్దకు చేరింది. ఈ అంశాన్ని సీఎం చంద్రబాబు సీరియస్‌గా తీసుకున్నారు. రెవెన్యూ, ఇంటెలిజెన్స్ వర్గాలతో విచారణ చేయించి, చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం ఎర్రగుంట్ల మండలంలోని ‘రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్’ నుంచి వెలువడే ఫ్లైయాష్ రవాణా విషయంలో కూటమి నేతల మధ్య వివాదం తలెత్తింది. పవర్ ప్లాంట్ నుంచి బయటికి వచ్చే వెట్ ఫ్లైయాష్.. (తడి బూడిద)ను ఎవరైనా ఉచితంగా తీసుకెళ్లొచ్చు. ఈ బూడిద విషయంలోనే జేసీ, ఆదినారాయణ రెడ్డి మధ్య వివాదం తలెత్తింది. ఇది పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తోందని సీరియస్ అయిన చంద్రబాబు.. అమరావతికి వచ్చి తనను కలవాలని ఇద్దరినీ ఆదేశించారు. చంద్రబాబు ఆదేశాల మేరకు ఆదినారాయణరెడ్డి శుక్రవారం సచివాలయానికి వచ్చారు. కానీ, జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం రాలేదు. వాస్తవానికి ఈ వివాదం మీద సీఎం చంద్రబాబుకు లేఖ రాసింది జేసీ ప్రభాకర్ రెడ్డే. అలాంటిది ఆయనే డుమ్మా కొట్టడం అనుమానాలకు తావిస్తోంది.