తెలంగాణలో భూముల వ్యవహారాలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ సీఎం కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులతో పాటు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు సంబంధించిన భూముల అంశాలపై విచారణకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. మొత్తం 16 అంశాలపై ఈ కమిటీ దర్యాప్తు చేయనుంది. ప్రభుత్వ, అసైన్డ్, భూదాన్, సీలింగ్, ఇనాం, అటవీ భూములతో పాటు మల్లన్నసాగర్, మిడ్మానేరు భూసేకరణ, పరిహారం, ధరణి మాడ్యూళ్ల వినియోగం వంటి అంశాలను కూడా విచారణ చేయనున్నారు. 5 జిల్లాల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టనున్న కమిటీ.. అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలు తేలితే బాధ్యులను గుర్తించి చర్యలకు సిఫారసు చేయనుంది.