రామగుండంలో నిర్వహించిన సింగరేణి కార్మిక గర్జన సభకు హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొత్త గడ్డం లుక్ అందరి దృష్టిని ఆకర్షించింది. గోదావరిఖనికి, సింగరేణి ప్రాంతానికి వెళ్తున్నందున గడ్డం పెంచినట్లు సరదాగా చెప్పిన ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సభలో సింగరేణి కార్మికుల చరిత్ర, తెలంగాణ ఉద్యమంలో వారి పాత్రను ప్రస్తావించారు. అదే సమయంలో నైనీ బొగ్గు బ్లాక్ టెండర్లు, సంస్థ ఉత్పత్తి తగ్గుదల, ప్రభుత్వ బకాయిలు, విద్యుత్ సరఫరా అంశాలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. టెండర్లలో అవకతవకలు, ఇతర స్కామ్లపై విచారణ జరపాలని కోరినట్లు తెలిపారు.