తెలంగాణ ప్రభుత్వం ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి రైతు భరోసా పంట పెట్టుబడి సాయం పంపిణీకి సర్వం సిద్ధం చేసింది. ఈ విడతలో అర్హులైన రైతుల ఖాతాల్లో ఎకరానికి రూ. 6 వేల చొప్పున జమ చేయనున్నారు. గత యాసంగిలో కేవలం రెండెకరాలకే సాయం పరిమితం చేయడంపై విమర్శలు రావడంతో.. ఈసారి సాగు చేసే ప్రతి ఎకరానికీ ఇవ్వాలని నిర్ణయించారు. అయితే రియల్ ఎస్టేట్, బీడు భూములు, రోడ్ల కిందకు వెళ్లిన సుమారు 5.50 లక్షల ఎకరాలను జాబితా నుండి తొలగించడం ద్వారా రూ. 1200 కోట్లు ఆదా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఐదు నుంచి ఏడున్నర ఎకరాల వరకే గరిష్ఠ కటాఫ్ విధించేందుకు కసరత్తు జరుగుతోంది.