కడప జిల్లా పులివెందుల మండలం ఆర్ తుమ్మలపల్లి గ్రామంలో నిర్వహించిన గంగమ్మ చింతల జాతరలో అపశృతి చోటు చేసుకుంది. ఆర్ తుమ్మలపల్లిలో ఏటా శివరాత్రి మరుసటి రోజున గంగమ్మ చింతల జాతర ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో గ్రామస్తులు సిరిమాను బండిని కాడెద్దులకు కట్టి గ్రామం నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న గంగమ్మ ఆలయానికి తీసుకెళ్తారు. అక్కడ పూజలు, బలులు ఇచ్చిన తర్వాత తిరిగి గ్రామానికి తీసుకొస్తారు. అయితే సిరిమాను తిరిగి గ్రామానికి బయలుదేరే సమయంలో అదే గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ సుదర్శన్ ప్రమాదవశాత్తూ బండి కింద పడిపోయాడు. తీవ్రగాయాల పాలైన అతడికి గ్రామస్తులు సపర్యలు చేసి పులివెందుల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అతడిని పరీక్షించిన డాక్టర్లు అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. దీంతో ఆర్. తుమ్మలపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. రెండేళ్ల క్రితం ఇదే జాతరలో మహేశ్వర్‌రెడ్డి అనే వ్యక్తి బండి నుంచి కిందపడి చనిపోయారని.. అయినప్పటికీ నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో మరో ప్రాణం పోయిందని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు.