తెలంగాణలో రహదారుల నెట్‌వర్క్‌ను బలోపేతం చేసేందుకు రాష్ట్ర మంత్రివర్గం అత్యంత కీలకమైన హ్యామ్ రోడ్ల ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపింది. రోడ్లు, భవనాల శాఖ పరిధిలో 34 ప్యాకేజీల ద్వారా మొత్తం రూ. 13,006.27 కోట్లతో 6,092.37 కిలోమీటర్ల మేర 441 రోడ్ల నిర్మాణాన్ని చేపట్టనున్నారు. టెండర్లలో గుత్తేదారులు అధిక ధరలు కోట్ చేయడంతో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు వ్యయాన్ని 5 శాతం ఎక్సెస్ లోపునకు కుదిస్తూ జీఎస్టీ మినహాయింపులు ఇచ్చారు. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు ఈ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. పంచాయతీరాజ్ శాఖ పరిధిలోనూ మరో 7,450 కిలోమీటర్ల గ్రామీణ రోడ్ల నిర్మాణానికి మంత్రిమండలి అనుమతి నిచ్చింది.