తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు తెలంగాణ హైకోర్టు నుంచి పెద్ద అడ్డంకి ఎదురైంది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 9పై హైకోర్టు స్టే విధించింది. ఈ అంశంపై సుదీర్ఘ వాదనలు విన్న న్యాయస్థానం.. నేడు విడుదలైన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్‌పై కూడా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ప్రభుత్వం నాలుగు వారాల్లో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. బీసీ రిజర్వేషన్లపై తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా పడింది.