తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాల కోసం ఉత్కంఠ నెలకొంది. మరికొన్ని గంటల్లో రానున్న ఫలితంపై ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నాయి. 2023లో బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ దాదాపు 16 వేల ఓట్లకు పైగా తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్‌పై విజయం సాధించారు. గోపీనాథ్ మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ప్రస్తుతం బీఆర్‌ఎస్ నుంచి ఆయన సతీమణి మాగంటి సునీత పోటీ చేస్తుండగా.. కాంగ్రెస్ నుంచి మాజీ మజ్లిస్ నేత నవీన్ యాదవ్ బరిలో ఉన్నారు. బీజేపీ తరఫున లంకల దీపక్ రెడ్డి పోటీలో ఉన్నారు. ఈ ఫలితం అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌లలో ఎవరికి పట్టు ఉందో తేల్చనుంది.