పదేళ్ల కిందట ఏపీ ప్రభుత్వం రాష్ట్రానికి ఆదాయ వనరుగా ఎర్రచందనాన్ని మార్చడానికి పెద్దఎత్తున ప్రయత్నాలు చేసింది. తిరుపతిలోని తిమ్మినాయుడుపాలెం సమీపంలో గొడౌన్లలో గ్రేడ్ల వారీగా విభజించి, భద్రపరిచింది. వీటికి భారీ డిమాండ్ ఉన్న జర్మనీ, జపాన్, చైనా తదితర దేశాలకు ఏపీ అటవీ శాఖ నుంచి ప్రత్యేక బృందాలను పంపించి మార్కెటింగ్ చేయించింది. బఫర్ స్టాక్‌తో కలిపి 7 వేల టన్నులకు పైగా నిల్వలున్నాయి. విక్రయాల్లో భాగంగా 20వ సారి గ్లోబల్ టెండర్లకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. త్వరలో సుమారు 1000 టన్నుల దుంగలకు వేలం నిర్వహించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఎ గ్రేడు టన్ను ధర రూ.65 లక్షల నుంచి రూ.75 లక్షలు, బి గ్రేడు రూ.36 లక్షలు, సి గ్రేడు రూ.20 లక్షలు, ఎన్ గ్రేడు రూ.7 లక్షలు, పొడి, పేళ్లు, వేర్లు టన్నుకు రూ.60 వేలుగా ధరలు నిర్ణయించారు. ఇక టెండర్లు నిర్వహించడమే మిగిలి ఉంది.