గతకొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో హల్‌చల్ చేస్తున్న అఘోరి.. తాజాగా తిరుపతి జిల్లాలో రాత్రిపూట రచ్చ చేసింది. చిల్లకూరు మండలం బోధనం టోల్ ప్లాజా వద్ద జాతీయ రహదారిపై గోవులను తరలిస్తున్న 3 లారీలను ఆపేసింది. ఎలాంటి అనుమతి పత్రాలతో గోవులను తరలిస్తున్నారంటూ వారిని ప్రశ్నించింది. గోవులను వధించేందుకే లారీల్లో తీసుకెళ్తున్నారంటూ అఘోరి ఆరోపించి.. లారీలను ఆపడంతో బూదనం టోల్ ప్లాజా వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పోలీసుల వ్యవహార తీరుతో అక్రమంగా నిత్యం పదుల సంఖ్యలో గోవులతో కూడిన లారీలు యథేచ్ఛగా జాతీయ రహదారులపై ప్రయాణిస్తున్నాయంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్కడే ఉన్న కొందరు హిజ్రాలు మాత్రం.. అఘోరిని అడ్డుకుని.. లారీలను ఎందుకు ఆపావు అని ప్రశ్నించడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. లారీలను స్వాధీనం చేసుకుని అక్రమార్కులపై పోలీసులు కేసు నమోదు చేయాలని అఘోరి డిమాండ్ చేసింది. ఆఘోరికి మద్దతుగా కొందరు హిందువులు గోవులను అక్రమ రవాణా చేస్తున్న లారీలను వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.