తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణానికి సంబంధించి మహారాష్ట్రతో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు తెలంగాణ సర్కార్ చొరవ చూపుతోంది. మహారాష్ట్రలో ప్రాజెక్టు కారణంగా ముంపునకు గురయ్యే భూములకు తగిన పరిహారం చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇందుకోసం అవసరమైన నిధులను జాయింట్ అకౌంట్లో ఉంచుతామని స్పష్టం చేశారు. ముంపు భూములపై మహారాష్ట్ర ప్రభుత్వం సర్వే నిర్వహించేందుకు కూడా అభ్యంతరం లేదన్నారు. గతంలో కుదిరిన ఒప్పందాలు, ప్రాజెక్టుకు సంబంధించిన పత్రాలను మహారాష్ట్ర అధికారులకు అందించాలని నీటిపారుదల శాఖను ఆదేశించారు. రెండు రాష్ట్రాల మధ్య నిరంతర చర్చలు, సమన్వయంతో ప్రాజెక్టుకు సంబంధించిన అడ్డంకులను పరిష్కరించాలని ప్రభుత్వం భావిస్తోంది.