ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కొత్త ఏడాది కానుకగా తెలంగాణ ప్రజలకు శుభవార్త చెప్పారు. తిరుమలలో శ్రీవారి దర్శనానికి సంబంధించి తెలంగాణకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సిఫార్సు లేఖలను అనుమతించేందుకు ఆదేశాలు జారీచేసినట్లు వెల్లడించారు. ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సోమవారం ఆయన లేఖ రాశారు. ప్రతి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ నుంచి ప్రతివారం సోమవారం నుంచి గురువారం వరకు రెండు రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనం 500 రూపాయల టిక్కెట్‌పై ప్రత్యేక దర్శనం కోసం రెండు లేఖలు అనుమతిస్తామని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. ఒక్కో లేఖపై ఆరుగురు భక్తులను దర్శనానికి సిఫార్సు చేయొచ్చని తెలిపారు. దీంతో చంద్రబాబుకు ధన్యవాదాలు చెబుతూ రేవంత్ రెడ్డి ఎక్స్‌లో ట్వీట్ చేశారు. అలాగే ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి కొండా సురేఖ తదితరులు చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు.