తెలంగాణలో నైరుతి రుతుపవనాల గమనం మందకొడిగా సాగుతున్నప్పటికీ.. రానున్న ఐదు రోజుల్లో రాష్ట్రమంతటా విస్తరించనున్నాయని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. జూన్ 19 నుంచి వారం రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి సూచనల మేరకు రెవెన్యూ, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ముంపు ప్రాంతాల ప్రజలను రక్షించడమే లక్ష్యంగా.. ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలని కలెక్టర్లను ఆదేశించారు. ప్రస్తుతానికి రాష్ట్రంలో 10 శాతం వర్షపాతం లోటు ఉండగా.. కొన్ని జిల్లాల్లో ఇంకా వడగాలుల ప్రభావం కొనసాగుతోంది.