వాహనంపై ట్రాఫిక్ చలాన్లు పెండింగ్‌లోఉన్నాయా.. చాలారోజులుగా వాటిని క్లియర్ చేయడం లేదా.. ఏదో సమయంలో ట్రాఫిక్ పోలీసులు చలాన్లపై డిస్కౌంట్ ప్రకటిస్తారు.. అప్పుడు కట్టేద్దాంలే అని వేయికళ్లతో ఎదురుచూస్తున్నారా.. గతంలో రెండు పర్యాయాలు ట్రాఫిక్ చలాన్లపై ప్రభుత్వం భారీగా డిస్కౌంట్ ప్రకటించింది. అదే మాదిరిగా ఈసారి కూడా ప్రకటిస్తారని వాహనదారులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో ఓ మెసేజ్ వైరల్ అవుతోంది. ట్రాఫిక్ పెండింగ్ చలాన్లపై భారీగా డిస్కౌంట్ ప్రకటించారని దాని సారాంశం. ఇంకేముంది సోషల్‌మీడియాలో దాన్ని షేర్ చేస్తోన్న నెటిజన్లు.. సూపర్ ఆఫర్ త్వరపడండి అంటూ కామెంట్లు పెడుతున్నారు. ట్రాఫిక్ చలాన్లపై డిస్కౌంట్ అంటూ జరుగుతున్న ప్రచారంపై ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. ట్రాఫిక్ పెండింగ్ చలాన్లపై రాష్ట్ర ప్రభుత్వం రాయితీ ఇస్తుందంటూ సోషల్ మీడియాలో వస్తోన్న వార్తల్లో నిజం లేదని తేల్చి చెప్పేశారు. ట్రాఫిక్ పెండింగ్ చలాన్లపై జరుగుతోన్న ప్రచారంలో వాస్తవం లేదని.. తప్పుడు ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ సీపీ విశ్వప్రసాద్ స్పష్టం చేశారు. ఈ మేరకు గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. అటువంటి విధానం అమల్లోకి వస్తే ముందుగానే ప్రకటిస్తామన్నారు. తప్పుడు ప్రచారాలు చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.