గుంటూరు జిల్లాలో తోడల్లుళ్లే తోడు దొంగలుగా మారి దొంగతనాలు చేస్తున్న వైనం వెలుగుచూసింది. కడప జిల్లాకు చెందిన ఆకుల శ్రీను, నాగదాసరి మహేష్‌లు తోడల్లుళ్లు. అయితే వీరిద్దరూ తోడుదొంగలుగా మారి చాలా రోజుల నుంచి గుంటూరు జిల్లాలో దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇటీవల వీరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వివరాలను జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడించారు. వీరిపై 7 దొంగతనాల కేసులు ఉన్నట్లు వివరించారు. వీరిద్దరూ డ్రైవర్లుగా పనిచేస్తున్నారనీ..గుంటూరు, కృష్ణా జిల్లాలలో దొంగతనాలకు పాల్పడినట్లు తెలిపారు. వీరి వద్ద నుంచి సుమారు 318 గ్రాముల బంగారం,1.5 కేజీల వెండి, ఆటో, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.