ఆంధ్రప్రదేశ్‌లో నమోదైన కేసుల గురించి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం హైదరాబాద్‌లో రామ్ గోపాల్ వర్మ విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తనపై నమోదైన కేసుల గురించి మాట్లాడిన ఆర్జీవీ.. తాను రోజూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటానని చెప్పారు. ఇప్పటి వరకూ వేల పోస్టులు పెట్టి ఉంటానన్న రామ్ గోపాల్ వర్మ.. వాటిలో కొన్నింటి వలన మనోభావాలు దెబ్బతిన్నాయని కేసు పెట్టారన్నారు. అయితే ఏడాది తర్వాత కేసు పెట్టడం ఏమిటని ప్రశ్నించిన ఆర్జీవీ.. తాను అరెస్ట్ అనేది మీడియా సృష్టేనని చెప్పారు. ఒకవేళ తనని అరెస్టు చేస్తే జైలుకు వెళ్తానని, జైలులో ఖైదీలతో స్నేహం చేసి సినిమా కథలు రాసుకుంటానని అన్నారు.