విజయవాడలో ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం సంతోషకరంగా ఉందన్నారు సినీ నటి జయప్రద. విజయవాడ అంటే ఎన్టీఆర్‌కు ఎనలేని ప్రేమని.. నటనకే నటన నేర్పిన వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు. తాను రాజకీయాల్లోకి రావడానికి ప్రధాన కారణం ఎన్టీఆరే అని.. ఎన్టీఆర్‌తో గడిపిన క్షణాలు మరువలేనివన్నారు. 1963లో ఎన్టీఆర్‌తో తమ సినీ ప్రస్థానం మొదలైందని నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు అన్నారు. ఎన్టీఆర్ కుటుంబానికి తామెంతో రుణపడి ఉన్నామని ఆయన చెప్పారు. ఎన్టీఆర్‌లో మంచి రచయిత కూడా ఉన్నారని ఆయన చెప్పుకొచ్చారు. చంద్రబాబు స్ఫూర్తితో తన తండ్రి రామానాయుడు రాజకీయాల్లోకి వచ్చారని గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలు కళాకారులు మాత్రమే కాదు.. అందరూ జరుపుకోవాలన్నారు. పేదవారి కోసమే ఆయన రాజకీయాల్లోకి వచ్చారని ఆమె చెప్పారు. కల్మషం లేని మంచి వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు.