ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఆరె శ్యామల అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి పౌరుషం చచ్చిపోయిందా అన్నారు. ‘వైఎస్సార్‌సీపీ తరుఫున మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. కూటమి నేతలకు క్రెడిబులిటీ లేదని.. వైఎస్సార్‌సీపీ హయాంలో మహిళలకు అగ్రతాంబూలం కల్పించారన్నారు. నవరత్నాల్లో కూడా 90 శాతం మహిళలకే నిధులు కేటాయించిందని.. దిశ యాప్‌తో వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి రక్షణ కల్పించారన్నారు. జాతీయ స్థాయిలో 19 అవార్డులు వచ్చిన దిశ యాప్‌ను కూటమి ప్రభుత్వం నిర్విర్యం చేసిందని.. దిశ ప్రతులను ఇప్పటి హోమంత్రి అనిత తగల బెట్టారన్నారు. పుంగనూరులో చిన్నారి హత్య జరిగితే హోంమంత్రి రాజకీయాలు మాట్లాడటం సిగ్గుచేటని.. ఆడపిల్లలు, మహిళలకు రక్షణ కలిగింది కేవలం వైఎస్ జగన్ పాలనలోనే అన్నారు. ఒక సోదరుడిగా, బిడ్డగా ముందుండి వైఎస్ జగన్ నడిపించారు. నవరత్నాల పథకంతో మహిళలకు గౌరవం పెరిగిందన్నారు.