పుష్ప 2 టికెట్ రేట్ల పెంపుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

1 month ago 4
పుష్ప 2 సినిమా టికెట్ ధరల పెంపుపై దాఖలైన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు మంగళవారం విచారించింది. బెనిఫిట్ షో పేరుతో ఒక్కో టికెట్‌కు అదనంగా 800 రూపాయలు వసూలు చేస్తున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మొదటి 15 రోజులు అధిక డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిపారు. భారీ బడ్జెట్‌తో సినిమా చిత్రీకరించడంతో టికెట్ ధరలు పెంచాల్సి వచ్చిందని మైత్రీ మూవీ మేకర్స్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ వాదనలు విన్న న్యాయమూర్తి.. ‘ప్రభుత్వమే టికెట్ రేట్లు పెంచడానికి అనుమతి ఇచ్చింది కదా’ అని పిటిషనర్ తరఫు న్యాయవాదిని ప్రశ్నించారు. అయితే, టికెట్ రేట్ల పెంపు వల్ల అభిమానులపై భారం పడుతోందని.. పైగా, అర్ధరాత్రి ఒంటి గంటకు, తెల్లవారుజామున నాలుగు గంటలకు షోలు పెట్టి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని పిటిషనర్‌ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. ‘టికెట్ ధరలతో పోలిస్తే థియేటర్లలో పాప్‌కార్న్, కూల్ డ్రింక్స్, మంచి నీళ్ల బాటిళ్లను ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారు కదా’ అని న్యాయమూర్తి ప్రశ్నించారు. అలాగే, పుష్ప 2 టికెట్ ధరల పెంపును ఉద్దేశించి కూడా నిర్మాత తరఫు న్యాయవాదిని జడ్జి ప్రశ్నించారు. బెనిఫిట్‌ షోకు ఒక వ్యక్తి 10 మంది కుటుంబ సభ్యులతో కలిసి వెళ్తే 8 వేల రూపాయలు అవుతుంది కదా అని అడిగారు. దీనికి నిర్మాత తరపు న్యాయవాది స్పందిస్తూ.. బెనిఫిట్‌ షో కేవలం హీరో అభిమాన సంఘాలకు మాత్రమేనని, అందుకే రేట్లు పెంచినట్లు కోర్టుకు తెలిపారు. కౌంటర్ దాఖలు చేయడానికి నిర్మాత తరఫు న్యాయవాది సమయం కోరగా, తదుపరి విచారణను డిసెంబరు 17వ తేదీకి న్యాయమూర్తి వాయిదా వేశారు. డిసెంబర్ 5న సినిమా విడుదల కానుంది.
Read Entire Article