తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు జరుగుతున్నాయంటూ పాడూరి శ్రీనివాస్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. పుష్ప-2 సినిమాలో ఫోటో దిగడానికి అంగీకరించలేదనే కారణంతో రాష్ట్ర ముఖ్యమంత్రిని హీరో పుష్పరాజ్ మార్చేస్తాడు. అందుకు హర్ట్ అయిన హీరో ఫైనల్‌గా సీఎం పీఠాన్ని కదిలించి.. తనకు నచ్చిన వ్యక్తిని సీఎం కుర్చీలో కూర్చోబెడతాడని.. ఇప్పుడు అలాంటి ప్లాన్ తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డిపై నడుస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ అరెస్ట్‌ను కొంతమంది తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని దుమారం రేపే వ్యాఖ్యలకు తెరతీశారు. గత 48 గంటలుగా ఈ వ్యవహారంలో పెద్ద కుట్ర జరుగుతోందని.. అల్లు అర్జున్ వెనుక ఓ శక్తి ఉందని పేర్కొన్నారు. రేపటి నుంచి వారం రోజుల్లో రేవంత్ రెడ్డి సర్కార్‌ను కూల్చడానికి ప్లాన్ చేశారని.. ఈ వారం రోజుల్లోనే ప్రతిపక్షాలు తాము అనుకున్న పని చేయాలనుకుంటున్నాయని పాడూరి శ్రీనివాస్ రెడ్డి తీవ్ర ఆరోపణలు గుప్పించారు.