Koti women's university: హైదరాబాద్‌లోని కోఠి ఉమెన్స్ కాలేజీ.. విద్యార్థినుల నిరసనలతో అట్టుడుకింది. తెలుగు నాట తొలి మహిళా కళాశాలగా ఏర్పాటైన ఈ కాలేజీని.. 2022లో కోఠి మహిళా విశ్వవిద్యాలయం అప్‌గ్రేడ్ చేశారు. దీంతో వందేళ్ల చరిత్ర కలిగిన ఈ ప్రతిష్టాత్మక కళాశాల.. తెలంగాణ తొలి మహిళా విశ్వవిద్యాలయంగా అవతరించింది. కోఠి మహిళా కాలేజీని మహిళా విశ్వవిద్యాలయంగా ప్రకటించడంతో నాటి కేసీఆర్ ప్రభుత్వంపై ప్రశంసల వర్షం కురిసింది. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెడుతున్నట్టు ప్రకటించారు. అయితే, కోఠి మహిళా కళాశాల.. విశ్వవిద్యాలయంగా మారి రెండేళ్లు పూర్తవుతున్నా, ఇప్పటికీ యూజీసీ గుర్తింపు దక్కలేదు. దీంతో విద్యార్థినులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చివరి సంవత్సరం విద్యార్థినిల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతోంది. కోఠి మహిళా విశ్వవిద్యాలయాన్ని యూజీసీలో చేర్చాలని డిమాండ్ చేస్తూ విద్యార్థినులు ఆందోళనకు దిగారు.