బర్డ్ ఫ్లూ ఉందని కోడి మాంసం షాప్‌లో కొనడానికి భయపడిన ప్రజలు ఉచితం అనడంతో వేల సంఖ్యలో తరలివచ్చారు. చికెన్ బిర్యానీ, కోడి కూర, చికెన్ రోస్ట్, ఉడికించిన కోడి గుడ్లు.. తిన్నోళ్లకు తిన్నంత ఫ్రీ అనగానే సిటీ ప్రజలు మెుత్తం వాలిపోయారు. గుంటూరు పట్టాభిపురంలోని స్వామి థియేటర్ వద్ద ఏపీ పౌల్ట్రీ ఫార్మర్స్ ఫెడరేషన్, గుంటూరు జిల్లా పౌల్ట్రీ ఫార్మర్స్, ట్రేడర్స్ అసోసియేషన్ శుక్రవారం చికెన్ మేళా నిర్వహించింది. దీని గురించి నాలుగు రోజుల నుంచి సోషల్ మీడియాలో సైతం విస్తృతంగా ప్రచారం చేశారు. ఇంకేముంది జనాలు పెద్ద ఎత్తున బారులు తీరారు. శుక్రవారం జరిగిన చికెన్ బిర్యానీ, చికెన్ మేళాకు ఒక్కసారిగా గుంటూరు నగర వాసులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఎంతలా వచ్చారు అంటే జనం తాకిడి తట్టుకోలేక నిర్వాహకులు గేటు మూసివేశారు. అయినా గోడలు దూకి మరి జనాలు ఫ్రీ చికెన్ తినడానికి వచ్చారు. పట్టాభిపురం పోలీసులు నియత్రించడానికి చూసినా ప్రయోజనం లేకపోయింది. త్వరగా వడ్డించాలని నిర్వహకులతో గొడవకు కూడా దిగారు. ఈ చికెన్ మేళాలో ప్రజా ప్రతినిధులు, డాక్టర్లు, వ్యాపారులు పాల్గొన్నారు.