మరోసారి హైదరాబాద్ నగరంలో అక్రమ కట్టడాలు, నిర్మాణాలపై హైడ్రా చర్యలు మొదలుపెట్టింది. తాజాగా, నానక్‌రామ్ గూడ భగీరథమ్మ చెరువు బఫర్ జోన్‌లోని అక్రమ నిర్మాణాల కూల్చివేతలను అధికారులు చేపట్టారు. బఫర్ జోన్‌లోని రెండు ఎకరాల స్థలంలో ఆక్రమణదారులు ఇటీవల రేకుల షెడ్లు నిర్మించారు. దీనిపై ఫిర్యాదులు రావడంతో హైడ్రా రంగంలోకి దిగి.. చర్యలకు ఉపక్రమించింది. తౌతానికుంట చెరువులోనూ అక్రమ నిర్మాణాల భరతం పట్టారు. మంగళవారం ఉదయం రెవెన్యూ, జీహెచ్ఎంసీ అధికారుల అక్కడకు చేరుకుని జేసీబీలతో నిర్మాణాలను నేలమట్టం చేశారు. దీనిపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. నోటీసులు ఇచ్చాక కూల్చివేతలు జరిపినట్లు ప్రకటించారు. భగీరథమ్మ, తౌతానికుంట చెరువుల్లోని 10 అక్రమ నిర్మాణాలను కూల్చివేశామని, 10 ఎకరాల ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకున్నట్లు రంగనాథ్ వెల్లడించారు.