JC Prabhakar Reddy: బీజేపీ నేతలపై జేసీ ప్రభాకర్‌రెడ్డి తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు దుమారం రేపుతోంది. బీజేపీ నేతలు హిజ్రాల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. న్యూ ఇయర్ సందర్భంగా తాడిపత్రిలో మహిళల కోసం ప్రత్యేకంగా ఓ కార్యక్రమం నిర్వహిస్తే మీకేంటి సమస్య అంటూ ఫైర్ అయ్యారు ప్రశ్నించారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్, వీహెచ్‌పీలు తనపై లేనిపోని ఆరోపణలు చేశాయన్న జేసీ ప్రభాకర్‌రెడ్డి.. అనంతపురంలో తన బస్సుల దహనం వెనుక బీజేపీ నేతల ప్రమేయం ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం చేశారు. ఇక తన బస్సులను పథకం ప్రకారం దగ్ధం చేసినా.. షార్ట్ సర్క్యూట్ అంటూ పోలీసులు కేసు నమోదు చేయడంపైనా జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసులకు చేతనైతే సుమోటోగా కేసు నమోదు చేసి తన బస్సులకు నిప్పంటించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వంలో రూ.450 కోట్లు డబ్బులు పోగొట్టుకున్నానని.. ఇప్పుడు రెండు బస్సులకు నిప్పంటిస్తే ఏమవుతుందని వ్యాఖ్యానించారు. వీళ్ల కంటే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చాలా మేలని తెలిపారు. జగన్ తన ప్రభుత్వంలో కేవలం తన బస్సులు మాత్రమే ఆపారని.. బీజేపీ ప్రభుత్వంలో మాత్రం తన బస్సులను తగులబెట్టించారని జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.