ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలలో చమత్కారాలు, ఆసక్తికర సన్నివేశాలు చోటుచేసుకుంటున్నాయి. విపక్షం సభలో లేకపోయినా కూటమి ఎమ్మెల్యేలే విపక్షంగా మారి ప్రశ్నలు అడుగుతున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం ప్రశ్నోత్తరాల సమయంలో ఆసక్తికర ఘటన జరిగింది. ప్రశ్నోత్తరాల సమయంలో జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి చేనేత సమస్యలపై మాట్లాడారు. చేనేత కార్మికుల సమస్యలను లేవనెత్తారు. అనంతరం డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ.. లోకం మాధవి మాట్లాడిన తీరును అభినందించారు. ఇదే సమయంలో ప్రభుత్వ ఉద్యోగులు నెలకు ఒక రోజు చేనేత వస్త్రాలను ధరించేలా చర్యలు తీసుకుంటున్నారా అని లోకం మాధవి ప్రశ్నించగా.. ఇంతకీ మీరు ధరించింది చేనేత చీరనా? లేక వేరే చీరనా? అని రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు. దీంతో తాను చేనేత చీరను ధరించానని ఆమె నవ్వుతూ సమాధానమిచ్చారు.