అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఆర్ అండ్ బీ గెస్ట్‌హౌస్ సమీపంలోని ఆదివారం ఓ హోటల్ ప్రారంభమైంది. ప్రారంభ ఆఫర్‌గా తొలిరోజే కేవలం 4 రూపాయలకే బిర్యానీ ఇస్తామని నిర్వాహకులు ప్రచారం చేశారు. అంతే ఇంకేముంది ఆ హోటల్ ఎదుట వందల సంఖ్యలో ప్రజలు క్యూ కట్టారు. ఆదివారం కావడంతో స్కూల్ విద్యార్థులు సైతం అక్కడికి భారీగా చేరుకున్నారు. ఒకరికి ఒక్క ప్యాకెట్టే ఇస్తామని చెప్పడంతో చాలామంది కుటుంబాలతో సహా వచ్చి క్యూలో నిలబడ్డారు. విపరీతమైన రద్దీ కారణంగా కొందరికి బిర్యానీ ప్యాకెట్ అందుకోవడానికి రెండు గంటలకు పైగానే సమయం పట్టింది. రద్దీ కారణంగా ఆ ప్రాంతంలో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి కంట్రోల్ చేయాల్సి వచ్చింది. ఈ ఆఫర్ మాత్రం హోటల్‌కి బాగానే గిట్టుబాటు అయింది. నిన్న ఒక్కరోజే సుమారు 3వేలకు పైగా బిర్యానీ ప్యాకెట్లు అమ్మినట్లు నిర్వాహకులు తెలిపారు. సెలబ్రెటీలతో ఓపెనింగ్ చేయించి వాళ్లకు లక్షలకు లక్షలు ఇచ్చే బదులు కస్టమర్లకు తక్కువ ధరకే బిర్యానీ ఇవ్వడంతో పాటు తమ హోటల్‌కి పబ్లిసిటీ వస్తుందన్న ఉద్దేశంతోనే ఇలా చేసినట్లు నిర్వాహకులు చెబుతున్నారు.