వికారాబాద్ జిల్లాలో దాదాపు 30 ఏళ్ల తర్వాత కూరగాయల సాగు రికార్డు స్థాయికి చేరుతోంది. గతంలో ఏటా 15–20 వేల ఎకరాల్లో సాగయ్యే కూరగాయలు.. 2026-27 వానాకాలంలో 44,610 ఎకరాలకు విస్తరించాయి. యాసంగిలో మరో 32 వేల ఎకరాల్లో సాగు చేపట్టేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న డిమాండ్, డ్రిప్ పరికరాలు, నీటి కుంటలు, పందిళ్ల ఏర్పాటుకు లభిస్తున్న రాయితీలు, నాణ్యమైన నారు అందుబాటు ఈ మార్పునకు దోహదం చేస్తున్నాయని వ్యవసాయశాఖ నిపుణులు చెబుతున్నారు. కూరగాయల హబ్, రవాణా సదుపాయాల అభివృద్ధితో సాగు మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.