Vijayawada Special Officers: ఏపీ ప్రభుత్వం విజయవాడలో పరిస్థితుల్ని చక్కదిద్దే పనిలో ఉంది. నగరంలో పరిస్థితుల్ని సమీక్షించి.. వరద బాధితులకు సాయం అందించేందుకు ప్రత్యేకంగా అధికారుల్ని నియమించారు. అలాగే హెలికాప్టర్ల ద్వారా వరద బాధితులకు ఆహారం, నీళ్లు, పాలు అందజేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్రంలో వరద పరిస్థితులపై ఉన్నతాధికారులతో సమీక్ష చేశారు. మూడుపూటలా బాధితులకు ఆహారం అందించాలని.. ముఖ్యంగా చిన్నారులు, గర్భిణులను పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు. బోట్లు ఎక్కడెక్కడ తిరుగుతున్నాయో మ్యాపింగ్ చేయాలని.. ఒకే ప్రాంతంలో కాకుండా మారుమూల ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. అందరికీ సాయం అందుతుందన్నారు చంద్రబాబు.