ప్రజల నుంచి అధికారులకు వచ్చిన ఫిర్యాదుల పరిష్కారంలో ఏఐ వినియోగంపై హైకోర్టు కీలక ప్రశ్నలు లేవనెత్తింది. భూ వివాదంలో తన వాదనలు వినకుండానే కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారని ఓ రైతు కోర్టును ఆశ్రయించగా.. ఏఐతో రూపొందించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకుని నిర్ణయం తీసుకున్నారని పిటిషనర్ తరఫు లాయర్ ఆరోపించారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయమూర్తి.. కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వులను తాత్కాలికంగా నిలిపివేశారు. రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు, కలెక్టర్, తహసీల్దార్ తదితరులకు నోటీసులు జారీ చేశారు. బాధ్యులపై తీసుకున్న చర్యలను వివరించాలని అడ్వకేట్ జనరల్‌ను ఆదేశిస్తూ విచారణను ఈనెల 18కి వాయిదా వేశారు.