వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పోలీసులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. అనంతపురం జిల్లా పర్యటనలో వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ పోలిస్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జనకుల శ్రీనివాస్ స్పందించారు. వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మాజీ ముఖ్యమంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. పోలీస్ డ్రెస్ ఒక ఉక్కు కవచం లాంటిదని.. రాజ్యాంగాన్ని కాపాడేదన్నారు. పోలీసుల్లో మహిళలు కూడా ఉంటారని.. జగన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని తప్పుబట్టారు. వైఎస్ జగన్ పోలీసులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని.. గౌరవించకపోయినా పర్లేదు.. కించపరిచి మాట్లాడకండంటూ సూచించారు.