త్వరలోనే బిగ్ బాంబ్ పేలుస్తానని చెప్పినట్టుగానే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సంచలన ఆరోపణలు చేశారు. కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమి వెనకాల సుమారు 10 వేల కోట్ల భారీ కుంభకోణం ఉందని కేటీఆర్ ఆరోపించారు. ఈ భూకుంభకోణానికి సంబంధించి కర్త, కర్మ, క్రియ, సూత్రధారి, పాత్రధారి అంతా రేవంత్ రెడ్డేనని కేటీఆర్ ఆరోపణ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 15- 16 నెలల్లో డిసెప్షన్, డిస్ట్రక్షన్, డిస్ట్రాక్షన్ అనే 3డీ మంత్రతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పేదలు, మధ్యతరగతి బతుకుల్ని నాశనం చేస్తోంది అని కేటీఆర్ ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములకు సంబంధించి భారీ కుంభకోణం ఉందని పలు ఆధారాలను మీడియాకు చూపించారు. హెచ్‌సీయూలో జరిగిన పర్యావరణ విధ్వంసం మీద దేశం మొత్తం నివ్వెర పోయి చూసిందని చెప్పుకొచ్చారు. హెచ్‌సీయూ పక్కన ఉన్న అటవీ భూములను అడ్డం పెట్టుకుని ఒక అతిపెద్ద ఆర్థిక మోసానికి రేవంత్ ప్రభుత్వం తెరతీసిందని.. ఇదొక నేరపూరిత కుట్ర అని.. తెలంగాణ ప్రజల పట్ల విశ్వాసఘాతుకమని కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.