వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారంలో గుంటూరులో 11 మంది పోలీసుల సస్పెన్షన్‌పై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర స్థాయిలో స్పందించారు. మతండ్రీ కొడుకులను, పవన్ కల్యాణ్ ను నమ్ముకుంటే పోలీసులకు ఏ గతి పడుతుందో కళ్లెదుటే కనిపిస్తోందన్నారు. హుందాతనం మరిచి రెడ్ బుక్ రచయిత లోకేశ్ ను చూసుకుని, అడ్రస్ లేని పవన్ కల్యాణ్ ను చూసుకుని రెచ్చిపోతే తిప్పలు తప్పవని పోలీసులను హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అధికారులను వాడుకుని వదిలేయడం సాధారణమని, ఈ విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సైలు, సీఐలు గమనించాలని సూచించారు. చంద్రబాబు ఎవరినైనా ఎర వేస్తారని, బలి చేస్తారని పేర్ని నాని తీవ్రంగా విమర్శించారు. అధికారి, బంధువు, పోలీసు, కార్యకర్త ఎవరైనా చంద్రబాబుకు ఒకటేనని అన్నారు. కేవలం కార్యకర్తలను మెప్పించడానికి 11 మంది పోలీసులకు శిక్ష విధించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. రెడ్ బుక్ చూసో, లోకేశ్ మాటలు వినో, చంద్రబాబు ఆదేశాలనో పాటించి కొందరు పోలీసులు అతిగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. దొంగ కేసులు పెట్టడం, కొట్టడం, తిట్టడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని, కాబట్టి అప్రమత్తంగా ఉండాలని అన్నారు.