ప్రజలకు మంచి చేసి వారి మనసుల్లో స్థానం సంపాదించుకునేలా నాయకుడు పాలించాలి.. అధికారం ఉందని దురహంకారంతో వ్యవహరిస్తే ప్రజలు, దేవుడు మొట్టికాయలు వేస్తారన్నారు మాజీ సీఎం జగన్. ఏపీ, తమిళనాడు ఎన్నికల్లో ప్రజలు వన్‌సైడ్‌గా ఇచ్చిన తీర్పులు చూశామని.. ప్రజలు ఈ పక్కన తంతే.. ఆ పక్కన పడతారన్నారు. అందువల్లే చంద్రబాబు 'మనల్ని' భయపెట్టే ప్రయత్నాలు చేస్తారు. అందరం కలిసి ఐక్యంగా ఉండాలన్నారు. కర్నూలు జిల్లాలో వైఎస్సార్‌సీపీ స్థానిక సంస్థల ప్రజానిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి హుందాగా వ్యవహరించాలి. కానీ చంద్రబాబు హుందాగా వ్యవహరించకుండా, అధికారంలో ఉన్నాం కాబట్టి అన్ని పదవులూ తమకే కావాలన్నట్లుగా సంఖ్యాబలం లేకపోయినా ఇటీవల స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో ప్రలోభాలకు దిగారన్నారు. ఇప్పుడు తనను ప్రశ్నించే స్వరం వినిపించకూడదని రాష్ట్రవ్యాప్తంగా ఒక భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారన్నారు. న్యూటన్స్ లా ప్రకారం చర్యకు, ప్రతి చర్య ఉంటుంది. చంద్రబాబు బంతిని ఎంత గట్టిగా కొడతారో అంతే వేగంతో అది పైకి లేచి ఆయనకే తగులుతుందన్నారు.