మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ క్రెడిబులిటి సున్నా అని విమర్శించారు. సొంత మేనల్లుడు, మేన కోడలు ఆస్తులు కాజేయ్యాలని కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. విజయసాయిరెడ్డితో జరిగిన భేటీలో చాలా విషయాలు చర్చకు వచ్చాయన్న షర్మిల.. విజయసాయిరెడ్డి జగన్ దగ్గర పడ్డ ఇబ్బందులు చాలా చెప్పారని అన్నారు. తన గురించి అబద్ధాలు చెప్పాలని విజయసాయిరెడ్డిని జగన్ ఒత్తిడి చేసారని ఆరోపించారు. విజయసాయిరెడ్డి చెప్పను అంటే బలవంతంగా ఒప్పించారని.. ప్రెస్ మీట్ పెట్టమని ఒత్తిడి చేశారని ఆరోపించారు. తనను వదిలేయమని విజయసాయిరెడ్డి వేడుకుంటే సుబ్బారెడ్డితో మాట్లాడించారని షర్మిల తెలిపారు. విజయసాయిరెడ్డి ఏం మాట్లాడాలనేదీ జగన్ నోట్ రాసిచ్చారని, 40 నిమిషాలపాటు డిక్టేట్ చేశారన్నారు. ఈ విషయాలన్నీ సాయిరెడ్డి చెప్తుంటే చాలా బాధేసిందని షర్మిల అన్నారు. వైఎస్ఆర్ కొడుకై ఉండి ఇంతలా దిగజారాలా అని ప్రశ్నించారు.