నవ నారసింహ క్షేత్రాల్లో ఒకటి అయిన కోనసీమ జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి రథోత్సవాలను ఘనంగా సాగుతున్నాయి. ఏటా మాఘమాసం శుద్ధ సప్తమి (రథసప్తమి) నుంచి తొమ్మిది రోజులపాటు ఈ క్షేత్రంలో దివ్య తిరుకళ్యాణ మహోత్సవాలు కనుల వైకుంఠంగా సాగుతాయి. మాఘమాసం సూర్యభగవానుడికి అత్యంత ప్రీతికరమైంది. ప్రత్యక్షదైమైన సూర్యుడు సాక్షాత్తూ నారాయణ స్వరూపం. కలియుగంలో కనిపించే దేవుడు సూర్యభగవానుడు. అందుకే రథసప్తమి తిథి నుంచి అంతర్వేదిలో తిరుకళ్యాణోత్సవాలు ప్రారంభమై... మాఘ పౌర్ణమి రోజు చక్రస్నానంతో ముగుస్తాయి. దశమి నాడు రాత్రి మృగశిరా నక్షత్రయుక్త వృశ్చిక లగ్నంలో కళ్యాణం జరుగుతుంది. మర్నాడు భీష్మ ఏకాదశి నాడు నూతన వధూవరులుగా మూర్తీభవించే శ్రీస్వామి, అమ్మవార్లను రథంపై ఊరేగిస్తారు. ఈ ఉత్సవాలను తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు.