సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగాలపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రేవంత్ రెడ్డి తన భాషను మార్చుకోవాలని హరీశ్‌రావు సూచించారు. తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి భాష గురించి మాట్లాడుతూ.. ఆయన మాట్లాడే బూతులు వినడానికే ఒళ్లు జలదరిస్తోందన్నారు. ఈ రాష్ట్రంలో తానే పెద్ద నీతిమంతుడిలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఈ రకంగా మాట్లాడితే మంచిదేనా అని అంటున్నారని.. అసలు ఈ బూతులకు ఆద్యుడెవరు..? నువ్వు కాదా..? అంటూ నిలదీశారు. జర్నలిస్టులను పట్టుకుని బట్టలిప్పదీసి రోడ్డు మీద కొడుతాం అని సంస్కారహీనంగా మాట్లాడటం కరెక్టేనా అంటూ ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి భాష జుగుప్సాకరంగా ఉందని.. ఆ బూతులు వింటే పిల్లలు చెడిపోతున్నారు అని హరీశ్‌రావు చెప్పుకొచ్చారు.