అన్నవరం సత్యదేవుడంటే భక్తులకు ఎంతో నమ్మకం.. నిత్యం ఎంతో మంది స్వామివారిని దర్శించుకుని పూజలు, వ్రతాలు నిర్వహిస్తారు. అయితే అన్నవరం ఆలయ సత్రంలో అపచారం జరిగింది. కొండదిగువన ఉన్న సత్య నికేతన్ సత్రంలో మద్యం బాటిళ్లు దర్శనమిచ్చాయి. సత్యనికేతన్ కాటేజీ వద్ద ఆలయ ఈవో వీర్ల సుబ్బారావు..ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సత్యనికేతన్ సత్రం గదులలో బీర్ బాటిళ్లు దర్శనమిచ్చాయి. ఈ నేపథ్యంలో దేవస్థానం గదులు పరిసరాలపై పూర్తి వివరాలు అందించాలని ఈవో ఆదేశించారు. దేవస్థానంకు సంబంధించిన సత్రం గదులలో ఇటువంటి అపచారం పనులు చేసిన వారిపై చర్యలు తీసుకోవడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. అక్కడకు మద్యం సీసాలు ఎవరు తీసుకుని వచ్చారు. అనే దానిపై విచారణ చేస్తున్నారు. సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. దీనిపై పూర్తిస్థాయి విచారణ చేసి నివేదిక ఇవ్వాలని ఈవో అధికారులను ఆదేశించారు.