కరీంనగర్ జిల్లా కొత్త సమీకృత కలెక్టరేట్ భవనం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. సుమారు 51 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ అత్యాధునిక భవనాన్ని సంక్రాంతి పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించే అవకాశం ఉంది. ఈ నూతన సముదాయం అందుబాటులోకి వస్తే జిల్లాలోని అన్ని ప్రభుత్వ విభాగాలు ఒకే ప్రాంగణంలో పని చేస్తాయి. దీనివల్ల ప్రజలు తమ పనుల కోసం వివిధ ప్రాంతాలకు తిరిగే ఇబ్బంది తప్పుతుంది. 2021లో ప్రారంభమైన ఈ భవన నిర్మాణాన్ని ప్రస్తుత ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో పూర్తి చేయించింది. పాత కలెక్టరేట్ భవనం ఇంకా పటిష్టంగా ఉండటంతో దానిని కూల్చకుండా ఇతర ప్రభుత్వ అవసరాలకు వాడుకోవాలని అధికారులు నిర్ణయించారు.