ఠాగూర్ సినిమాలో చనిపోయిన శవానికి ఆస్పత్రి సిబ్బంది వైద్యం చేస్తున్నట్టు నటించి డబ్బులు గుంజే సీన్ అందరికీ గుర్తుండే ఉంటుంది. అచ్చంగా అలాంటి సంఘనటే.. హైదరాబాద్ మియాపూర్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో జరిగింది. సుహాసిని (26) అనే యువతికి కళ్ళు తిరిగి పడిపోతే కడప హాస్పిటల్ నుంచి హైదరాబాద్‌లోని సిద్ధార్థ్ న్యూరో అనే ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. అయితే.. నెల రోజుల నుంచి అమ్మాయికి చికిత్స అందిస్తున్నామని చెప్పి ఇప్పటివరకు రూ. 12. 50 లక్షల బిల్లు కట్టించుకున్నారు.ఇంకో రూ.5 లక్షలు కట్టాలని.. అమ్మాయి బతుకుతుందని ఆస్పత్రి సిబ్బంది బంధువుల్లో ఆశలు పెంచుతూ వచ్చారు. తీరా.. ఈరోజు (ఫిబ్రవరి 08న) ఉదయం బిల్ కట్టనక్కర్లేదని.. నిమ్స్ ఆస్పత్రిలో జాయిన్ చేస్కోండని హాస్పిటల్ యాజమాన్యం చెప్పింది. దీంతో.. బాలిక పేరెంట్స్ నిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లగా ఎమర్జెన్సీ వార్డులో పరిశీలించిన వైద్యులు యువతి చనిపోయిందని చెప్పారు. దీంతో యువతి మృతదేహాన్ని తిరిగి సిద్ధార్థ్ న్యూరో ఆస్పత్రికి తీసుకొచ్చిన బంధువుల తమకు న్యాయం చేయాలని ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. మూడు, నాలుగు రోజుల క్రితమే చనిపోయినా తమకు ఇప్పటి వరకు సమాచారం అందించలేదని.. సిద్ధార్థ హాస్పిటల్ పైన తగిన చర్యలు తీసుకోవాలంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.