ప్రతిపక్ష హోదాపై నిరాధార ఆరోపణలతో జగన్ తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు అన్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే సరైన సంఖ్యా బలం ఉండాలని చట్టం చెబుతోందన్నారు. 175 మంది సభ్యులున్న శాసనసభలో కనీసం 18 మంది సభ్యుల బలం ఉంటే తప్ప ప్రతిపక్ష హోదా రాదన్నారు. అంటే కనీసం 10 శాతం సభ్యులు ఉంటేనే ప్రతిపక్ష హోదా వస్తుందనే నిబంధనను గతంలో జగనే సభలో ప్రస్తావించారన్నారు. ఇవన్నీ తెలిసీ జగన్ చేసిన ప్రేలాపనలను సభాపతి హోదాలో క్షమించి వదిలేస్తున్నానన్నారు. సభకు దూరంగా ఉంటున్న ఎమ్మెల్యేలు.. ప్రజలు తమను ఎందుకు గెలిపించారో ఆలోచించాలన్నారు. సభకు రాకుంటే తమ నియోజకవర్గ ప్రజల సమస్యలు ఎవరు లేవనెత్తుతారు?.. ఇవన్నీ గ్రహించి సభకు రావాలని వైఎస్సార్‌సీపీ సభ్యుల్ని కోరుతున్నాను అన్నారు అయ్యన్నపాత్రుడు.